10 సింహాల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్

గూడ్సు రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి పది సింహాల ప్రాణాలను కాపాడింది. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పిపవవ్ పోర్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు ట్రాకుపై కూర్చుని ఉన్న 10 సింహాలను చూసిన గూడ్సు రైలు ఇంజన్ డ్రైవర్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఆ సింహాల ప్రాణాలను రక్షించాడు. ఇంజన్ డ్రైవర్ ముకేష్ కుమార్ మీనా పిపవవ్ పోర్టు స్టేషన్ నుంచి సైడింగ్(ప్రధాన కారిడార్‌కు పక్కన చిన్న ట్రాకు)లోకి గూడ్సు రైలును తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే భావ్‌నగర్ డివిజన్ ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాకుపై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను చూసిన వెంటనే ముకేష్ ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించారు. రైలు ట్రాకుపై నుంచి సింహాలు లేచి వెళ్లిపోయేంత వరకు వేచి చూశారు.

అవి వెళ్లిపోయిన తర్వాత రైలును ముందుకు నడిపి సైడింగ్‌లో ఉంచారు. ఇంజన్ డ్రైవర్ సమయోచితంగా తీసుకున్న నిర్ణయాన్ని రైల్వే అధికారులు ప్రశంసించారు. సింహాలతోసహా వ్యన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే ట్రాకుపై నడచి వెళ్లే వన్యప్రాణుల పట్ల లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. సూర్యోదయానికి ముందు టార్చ్‌లైట్ వెలుగులో రైలు ట్రాకుపై కూర్చున్న సింహాలు లేచి మెల్లగా నడుచుకుంటూ అడవిలోకి అదృశ్యం అవుతున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్ కెమెరాలో లోకో పైలట్ ముకేష్ బంధించారు.



from Mana Telangana https://ift.tt/OeCVZ18

Post a Comment

Previous Post Next Post

Below Post Ad