
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైంది. కాగా టీజర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజర్ లో వాడిన పదాలు స్టువర్టుపురం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని… దానిపై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో విడుదలకు ముందే టైగర్ నాగేశ్వరరావు చిత్ర యూనిట్ కి గట్టి దెబ్బ తగిలింది.
ధమాకా,వాల్తేరు వీరయ్య తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు మాస్ మహారాజ రవితేజ. కానీ తర్వాత వచ్చిన రావణాసుర చిత్రం నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు గా అలరించాలని మాస్ మహారాజ భావించారు. కానీ టీజర్ విడుదల తోనే వివాదాన్ని మూట కట్టుకుంది. ఈ మూవీ స్టువర్టుపురం లోనే ఎరుకల సామాజిక వర్గ మనోభావాలను కించపరిచేలా ఉందని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని చుక్క పాల్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపున పృథ్వీరాజ్, కార్తీక్ అనే న్యాయవాదులు బలమైన వాదించారు. దీంతో న్యాయమూర్తులు స్పందించారు. టీజర్ లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రజలను అవమానించేలా ఉందని కోర్టు భావించింది సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సమాజం పట్ల బాధ్యత ఉండాలని.. ఇలాంటి టీజర్ వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించింది.
ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కు సూచించింది. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అభ్యంతరాలపై ముంబై సెంట్రల్ బోర్డుకి చెందిన చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 31న సినిమా విడుదలకు నిర్ణయించారు. ఇంతలోనే టీజర్ వివాదం నెలకొంది.
source https://oktelugu.com/tiger-nageswara-raos-movie-was-a-big-setback/