
House Underground: తనకున్న పొలాన్ని తవ్వి భూగర్భంలో ఏకంగా రెండంతస్తుల మేడను కట్టాడు ఓ రైతు. ఇందుకుగాను ఎటువంటి యంత్రాలు, పరికరాలు వాడలేదు. మనుషుల సాయం కూడా తీసుకోలేదు. కేవలం చిన్నపాటి పార సాయంతో 12 సంవత్సరాల పాటు కష్టపడి రెండంతస్తుల మేడను అందంగా తీర్చిదిద్దాడు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది ఈ ఘటన.
ఉత్తరప్రదేశ్ లోని హర్దోయీ కి చెందిన ఇర్ఫాన్ అలియాస్ పుష్ప బాబా ఢిల్లీలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. 2010లో ఆయన తండ్రి చనిపోయాడు. దీంతో గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో మనస్థాపంతో కొద్దిరోజులు పాటు గ్రామానికి దూరమయ్యాడు.ఆ మరుసటి సంవత్సరమే గ్రామానికి తిరిగి వచ్చి ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఏదో రకంగా ఒక అద్భుతాన్ని సృష్టించి సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని భావించాడు. పొలంలోని భూగర్భంలో ఇల్లు కట్టాలని డిసైడ్ అయ్యాడు. 2011లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. చిన్న పారాలాంటి పరికరం సాయంతోనే పని మొదలుపెట్టాడు. పాతకాలం మాదిరిగా అండాకారంలో ఇంటి గోడలను చెక్కాడు. ఈ పనుల్లో నిమగ్నం అయినప్పుడు భోజనం చేసేందుకు మాత్రమే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేవాడు. ప్రార్థన మందిరం, డ్రాయింగ్ రూమ్..ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా 11 గదులతో ఇర్ఫాన్ ఇల్లు కట్టాడు. చూడముచ్చటగా ఉండడంతో ఇంటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
source https://oktelugu.com/he-built-a-two-storied-floor-underground/