కళాకాంతుల కొండపల్లి కుంచెకు శతజయంతి

Kondapalli Seshagiri Rao arts

‘పరుగెత్తే నది నైనా
బంధించును చిత్రం
అంతటి ఆకాశమైనా
ఇంతవును విచిత్రం’
‘కొండపల్లి శేషగిరిరావు’ ‘గంగానది’ చిత్రాన్ని చూసి దాశరథి కృష్ణమాచార్యులు కవిత్వమల్లారు. అవును వీరి చిత్రాలను చూసి ఏ హృదయం స్పందించదు? ఏ కవి కలం కవిత్వం ఒలికించదు? కొండపల్లి చిత్రాల అందాలు మన కళ్ళను, కాళ్ళను కట్టిపడేస్తాయంటే అతిశయోక్తి కాదేమో!
ఓరుగల్లు గడ్డ వీరిని కని ఏ పుణ్యం చేసుకుందో! కవుల, కళాకారుల నిలయమై తరతరాల చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకుని, ప్రపంచాన్నే తన వైపు మళ్లించుకుంది. మానుకోట దగ్గరలోని పెనుగొండ గ్రామంలో 1924 జనవరి 27న జన్మించిన కొండపల్లి శేషగిరిరావు బాల్యంలో సుఖసంతోషాలతో గడిపినా, యవ్వనంలో పడలేనన్ని కష్టాలు పడ్డారు. అయినా అధైర్య పడలేదు. తన ధ్యేయాన్ని ఊతకర్రగా చేసుకొని హైదరాబాదు నగరానికి పయనమైన ఈ చిత్రకారుడు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించుకున్న స్థాయికిఎదిగారు. ‘కష్టేఫలి’ అనే మాటను తమ జీవితాంతం నమ్మిన వ్యక్తిగా ఆదర్శవంతమైన సౌశీల్యంతో ఎన్నెన్నో సోపానాలను అధిగమించారు. ‘కొండపల్లి’ అంటేనే కొండపల్లి శేషగిరిరావు చిత్రాలు అనే పేరును పొందారు.

పుట్టుకతో వచ్చిన చిత్రకళా నైపుణ్యాన్ని మాస్టర్ మజహారుద్దీన్, మహమ్మద్ షరీఫ్ మెరుగులు దిద్దారు. వట్టికోట ఆళ్వారుస్వామి, పెండ్యాల రాఘవరావు, గుండవరం హనుమంతరావు శేషగిరిరావును మెహదీ నవాజ్ జంగ్ కు పరిచయం చేయగా, సుందరమైన వీరి చిత్రాలను చూసి ఆర్ట్ కళాశాలలో సీట్ ఇప్పించారు. 5 ఏళ్ల చదువు పూర్తిచేసుకున్న శేషగిరిరావును రవీంద్రనాథ్ స్థాపించిన విశ్వ భారతి శాంతినికేతన్ కు పంపించారు.

ఈ 22 ఏళ్ల నవయువకుడు తన ‘చిత్రలేఖనం’ అనే కళా ధైర్యాన్ని వెంటబెట్టుకుని కలకత్తా నగరానికి వెళ్ళాడు. నందలాల్ బోస్, అవనీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయల శిష్యరికంలో తన సృజనాత్మకతకు నగిషీలు చెక్కుకొని చక్కని చిత్రాలెన్నెన్నో చిత్రించారు. తాము చిత్రకళాభ్యాసం చేసిన స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, హైదరాబాద్ కళాశాలలోనే చిత్రకళాధ్యాపకులుగా ఉద్యోగమొచ్చింది. ఇక వెను తిరిగింది లేదు. ఎన్నో బొమ్మలు ఎన్నో ప్రైజ్‌లు! 1961, 1969 ఢిల్లీలో శేషగిరిరావు నిర్మించిన రిపబ్లిక్ డే టాబ్లోలు ప్రథమ బహుమతి గెలుచుకున్నవి. 1975 ప్రపంచ తెలుగు మహాసభలలో వీరు చిత్రించిన ‘తెలుగు తల్లి’ కీర్తి తెచ్చిపెట్టింది.

‘గీత నా ప్రాణ పల్లవి
కాంతి కల్పనా క్రాంతి పథము
దృక్కు దృశ్యమ్ము అమృత దీపమ్ములిచట
మధ్య శూన్యంబు రూప ప్రస్థాన యాత్ర’

అంటూ శేషగిరిరావు తన ముఖచిత్రం వేసుకొని ఈ కవితను రాసి తమ మనసును విప్లవించారు. వీరు చిత్రకారులే కాదు కవి, రచయిత. ‘పోతన చిత్రమయీ కావ్యం’, ‘ఆదిమకళ’, ‘ఆంధ్ర దేశంలో చిత్రకళ’, ‘తెలంగాణలో చిత్రకళ’, ‘కాకి పడిగెలు’ వంటి వ్యాసాలు, సంగ్రహాంధ్ర విజ్ఞాన సర్వస్వం లో ‘అలంకరణ చిత్రణ’, ‘కుడ్య చిత్రకళ’ వ్యాసాలు వీరి పరిశోధనాత్మక రచనా సామర్థ్యానికి మచ్చుతునకలు. ఆనాటి ముఖ్యమంత్రులు, మంత్రులు, విద్యావేత్తలు, సుప్రసిద్ధ కవులు, కళాకారులందరు వీరికి మిత్రులు. ఈనాటి మేటి చిత్రకారులందరూ వీరి విద్యార్థులు. వర్ణమయ చిత్రాలలా చెరగని చిరునవ్వులు వీరి నెరిగినవారెవరూ మరువరు.

Kondapalli Seshagiri Rao arts

గడ్డిపోచనూ గంభీర కొండనూ, సామాన్యుణ్ణీ మాన్యుణ్ణీ సమదృష్టితో చూసిన శేషగిరిరావు మంచితనానికి చిరునామా. మానవీయ కోణంలో ఆవిష్కరించిన ‘మదారి’ (కోతులనాడించే మనిషి), ఫిషర్ మెన్, రైతు, సంతాల్ నృత్యం, పల్లె పడుచు డెత్ అండ్ డిజైర్, కాకులు, బిచ్చగాడు వంటి చిత్రాలైనా ఆధ్యాత్మిక కోణం లో ఆవిష్కరించిన దేవీదేవతాచిత్రాలైనా ఒక్కటే వారికి. కావ్య నాయికానాయకుల చిత్రాలైనా, చరిత్రచిత్రాలైనా, సంస్కృతి సంప్రదాయాల చి త్రాలైనా పెయింటింగ్స్ అంటే ఇంత సత్య సుందరంగా ఉండాలనేలా వేసారు. 1954లోనే తెలంగాణా పల్లెపల్లె తిరిగి ‘కాకి పడిగెలు’ పట చిత్రాలను వెలుగులోకి తీసుకువచ్చిన కొండపల్లి చిత్రకళా నైపుణ్యం, పరిశోధనా తత్వాలతో కొండంత వ్యక్తి త్వం సమ్మిళితమై అభ్యుదయ భావ చిత్రంగా మనకు కనిపిస్తారు.

వీరు డాక్టరేట్ పొందినా, పురస్కారాలు అందుకున్నా ఆనాటి సభావేదికలు మురిసిపోయాయి. ఆశయాలు మంచివయితే అవకాశాలు వస్తాయని నమ్మిన శేషగిరిరావు తనదైన కళా సామ్రాజ్యంలోనే జీవించారు. 2013 జులై 26 నాడు మరణించినా, వందల వేల వర్ణరంజిత చిత్రాలలో సజీవంగా ఉన్నారు. భారతీయ చిత్రకళా రీతులను ఓ శతాబ్దం నడిపించి కళాకాంతులు వెదజల్లిన కుంచె కొండపల్లి శేషగిరిరావు కుం చె. 2025 జనవరి 25 నుండి పది రోజులు మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో శేషగిరిరావు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. చిత్రకళాపిపాసులకు ఇదొక మంచి అవకాశం.
డాక్టర్ కొండపల్లి నీహారిణి



from Mana Telangana https://ift.tt/10XADfw

Post a Comment

Previous Post Next Post

Below Post Ad