Gajwel BRS: గజ్వేల్‌లో బీసీ ల తిరుగుబాటు

Gajwel BRS

Gajwel BRS: బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌లో బీసీలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఓసీలకే పెద్ద పీట వేయడంపై బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎనిమిది అన్‌రిజర్వుడ్‌ స్థానాలు ఉండగా, మరో రెండు ఎస్సీ రిజర్వు స్థానాలు ఉన్నాయి. వీటిలో గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు నియోజకవర్గాలకు ఓసీలైన సిటింగ్‌లకే పార్టీ టికెట్లు కేటాయించింది. పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్‌ నియోజకవర్గ టికెట్‌ కూడా ఓసీకే ఇవ్వాలని నిర్ణయించింది. సంగారెడ్డి నియోజకవర్గ టికెట్‌ను మాత్రమే బీసీ అయిన చింతా ప్రభాకర్‌కు కేటాయించింది. అయితే, ఈ సారి పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల కోసం బీసీలు తీవ్రంగా ప్రయత్నించారు. సంగారెడ్డి టికెట్‌ను పద్మశాలి వర్గానికి చెందిన చింతా ప్రభాకర్‌కు ఇచ్చినా.. ముదిరాజ్‌, గొల్లకురుమల నాయకులు గట్టిగా పట్టుపట్టారు. ఈ మూడు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి, భంగపడ్డ వారందరూ.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. అభ్యర్థుల గురించి బీఆర్‌ఎస్‌ నాయకత్వం పునరాలోచించకపోతే, ఇతర పార్టీల్లో చేరి పోటీకి దిగాలన్న అభిప్రాయంతో నాయకులు ఉన్నారు. తాము గెలవక పోయినా బీఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు.

పోటీకి సిద్ధమవుతున్నది వీరే..

పటాన్‌చెరు టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నించిన బీసీల్లోని ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన నీలం మధు.. ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికీ తన సామాజికవర్గం వారితో చర్చించి పోటీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బీఎస్పీ లేదా టీడీపీలో చేరి ఆ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పటాన్‌చెరులో టీడీపీ ప్రభావం ఉంటుం దన్న అంచనాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

అలాగే, సంగారెడ్డి నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు, గొల్లకురుమ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ జి.శ్రీహరి సైతం పోటీ చేసే యోచనలో ఉన్నారు. సంగారెడ్డిలో 10 వేల మంది ముదిరాజ్‌, గొల్లకురుమలతో సభ నిర్వహించి, సత్తా చాటాలని పట్నం మాణిక్యం భావిస్తున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తట్టుకుని గెలవడం.. చింతా ప్రభాకర్‌ వల్ల కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు బీజేపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటలతో చర్చించినట్టు సమాచారం. ఇక, నారాయణఖేడ్‌లో విగ్రాం శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఇతర పార్టీల నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. బీఆర్‌ఎస్‌లోని బీసీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రాజకీయపోరు ఆసక్తికరంగా మారింది.



source https://oktelugu.com/bcs-are-preparing-for-a-revolt-in-the-joint-medak-which-is-the-home-district-of-cm-kcr/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad